For new songs. Writing lyrics is my hobby. Can give 'wedding card invitation' starting with all letters of your name.
Saturday, 16 May 2026
Sabarimala Yatra
మా శబరిమల ప్రయాణం
నేను మా సహోదరిలు మా అత్తమ్మ మా అపార్ట్మెంట్లో తెలిసిన ఒక పెద్దావిడ అందరం కలిసి శబరిమల యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాం!
శబరిమల లో అయ్యప్ప దర్శనం ప్రతిరోజు ఉండదు నెలకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. విషు పండుగకు వెళ్లాలని మేము ప్లాన్ చేసుకున్నాము. దారిలోనే తిరుమల దర్శనం చేద్దామని అనుకున్నాము. మూడు నెలల ముందు తిరుమల దర్శనం నలుగురికి మాత్రమే దొరికింది, మిగతా నలుగురు కోసం దివ్య అనుగ్రహ హోమం, అలిపిరి దగ్గర గోశాలలో జరుగును అది ఎంచుకొని దర్శనం చేద్దామని బుకింగ్ చేసుకున్నాము. అలాగే పళనిలో దండాయుధ పళని సుబ్రమణ్య స్వామిని దర్శించుకుందామని అనుకున్నాము మరియు మధురై మీనాక్షి సుందరేశ్వర స్వామి దర్శించాలని నిర్ణయించుకున్నాము.
ఎవరి స్వస్థలాల నుండి తిరుపతి చేరుకున్నాము. తిరుపతి వసతిలో అందరం రిప్రెష్ అయి నలుగురు వారికి దర్శనం ఉంది కాబట్టి వారు తిరుచానూరు అమ్మవారి దర్శనం చేసుకొని తిరుమల చేరుకున్నారు, మేము నలుగురు అలిపిరికి వెళ్లి హోమం చూసుకొని ఒక కారు మాట్లాడుకుని తిరుమలకు బయలుదేరాము. బయట నుండి వరాహ స్వామి దర్శించుకుని, అహోబిల నృసింహ స్వామిని దర్శించుకుని, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరి చెకింగ్ చేసుకుని హాలులో కూర్చున్నాం. వేడి వేడి కదంబ ప్రసాదం గైకొని ఆత్మారాముని శాంతించాము. అలా కొద్ది సేపు తరువాత దర్శనానికి వదిలారు. దారిలో తిరుమల నంబి సన్నిధి చూసుకొని, హాథిరాం బాబా మండపం మీద ఉన్న దశావతారాల్లో వరాహస్వామిని మిగతా స్వాములను దర్శించుకుని, రాజగోపురం దరి కాళ్ళు తడుపుకొని రంగ మండపం, తులాభారం చూస్తూ ధ్వజస్తంభం దాటి వెండి వాకిలి రద్దీని దాటుకొని బంగారు వాకిలి దగ్గరికి చేరుకున్నాము. గరుడాళ్వారును దర్శించుకుని శ్రీ వేంకటేశ్వర స్వామిని ధగధగ మెరుపులలో రెండు కన్నులను పెట్టి షాస్టాంగములను ప్రేరేపించి దర్శనం చేసుకున్నాము.
బయటికి వచ్చి లక్ష్మీ బావి దగ్గర మోకరిల్లి, గోపురం పైన శ్రీ వేంకటేశ్వరుని వీరాసనం కోసం చూశాం, అలాగే గోపురం పైన శ్రీ యంత్రములు, చిన్ని కృష్ణుని, నరసింహస్వామి, సింహాలను విభిన్న దేవతా మూర్తులను దర్శించుకుని విమాన వేంకటేశ్వర స్వామి దగ్గరికి చేరుకున్నాము. విశేషమేమంటే తిరుమలలో బయటకు వెళ్లడానికి కూడా చాలా రద్దీ ఉంటుంది. హుండీలో డబ్బులు వేసి, వెండి వాకిలి రద్దీని దాటి రుచికరమైన పులిహోర ప్రసాదము తిన్నాము. లడ్డూలు కొనుక్కొని వెంగమాంబకు వెళ్లి వేడివేడిగా భోజనం చేసి తిరుపతికి దిగువ ప్రయాణం.
కొద్దిగా విశ్రమించి తెల్లవారుజామున నాలుగు గంటలకు శబరిమల వెళ్ళుటకు చెంగన్నూరు వెళ్ళు కేరళ ఎక్స్ప్రెస్ ఎక్కినాము. సాయంకాలం ఆరు గంటలకు చెంగన్నూరు చేరినాము. ఒక జత బట్టలు తీసుకొని మిగతా లగేజ్ అంత క్లోక్ రూంలో పెట్టినాము. (ఎందుకంటే మళ్లీ తిరిగి పళని వెళ్లడానికి చెంగనూరు రావాలి). పంబాలో రాత్రి బస చేసి ఉదయాన్నే స్నానం చేసి శబరిమల పాదయాత్ర ప్రారంభించాము. స్పాట్ దర్శనం తీసుకొని పంబా గణపతిని శబరిమల యాత్ర విజయవంతం చేయాలని కోరి, శబరిమల కొండలెక్కడానికి వెళ్ళాము. అందరూ 50 ఏళ్ల పై వాళ్ళమే అయినను డోలి తీసుకోకుండా అడుగులో అడుగు వేసుకుంటూ ఐదు కొండలు ఎక్కాము. సుమారు మధ్యాహ్నం 12 గంటలకు కాళ్లు కాల్చుకుంటూ దర్శనం క్యూలోకి వెళ్ళాము. ఆఖరి దర్శనం మాదే ఒంటిగంటకు గుడి తలుపులు మూస్తారు మేము జస్ట్ కొద్దిగా ముందుగా దర్శనం చేసుకున్నాము. మాలికాపురోత్తమ గుడికి వెళ్లి, బయట కొద్దిగా భుజించి, ప్రసాదాలు కొనుక్కొని నెయ్యి కూడా కొనుక్కొని కిందకు బయలుదేరాము. పెద్దవాళ్లు నలుగురు డోలితో కిందకి వెళ్లారు. మేము నలుగురు నడుచుకుంటూ కిందకు వెళ్ళాము. బస్సులో చెంగనూరు వెళ్ళి, గ్యాస్ ప్రాబ్లం వల్ల సరైన హోటల్స్ లేవు అక్కడ దొరికిన చపాతి రైస్ ఐటమ్స్ తిని లగేజ్ తీసుకొని పళని కి వెళ్లే ట్రైన్ కోసం ఎదురు చూశాం. అందరం అలసిపోయి ఉన్నాము కాబట్టి ట్రైన్ ఎక్కగానే బెర్తులో నిద్ర పట్టింది. ఉదయాన్నే పళని చేరుకున్నాం.
పళనిలో విషు కారణంగా దేవస్థానం రూములు దొరకలేదు ప్రైవేట్ రూములు 2600 ఇచ్చి రెండు రూములు తీసుకొని, స్నానాదులు చేసి, నాష్ఠా చేసి సుబ్రమణ్య స్వామి దర్శనం కు బయలుదేరాము. పళని కొండ ఎక్కుటకు 3 మార్గాలు నడకదారి, వించ్ రైలు మరియు రోప్వే ద్వారా వెళ్ళవచ్చు మేము ఎక్కుటకు వించ్ రైల్ ఎంచుకున్నాం. కొండ పైకి ఎక్కి ఒక గంటలో దర్శనం చేసుకున్నాము. బయటకు వచ్చి ప్రసాదాలు తిని ఇంటికి కూడా పంచామృతము తీసుకొని కిందకి రోప్వే ద్వారా దిగినాము. రూమ్ ఖాళీ చేసి పళని స్టేషన్ నుండి మధురై బయలుదేరినాము.
మధురైలో ఆఖరి ప్లాట్ఫామ్ లో ట్రైన్ ఆగింది. మా గ్రూపులోని పెద్దవాళ్లు కొద్దిగా ఇబ్బంది పడ్డారు ఒకటవ ప్లాట్ ఫామ్ కి రావడానికి. లగేజీని క్లోక్ రూమ్ లో పెట్టి ఆటో తీసుకొని మీనాక్షి అమ్మవారి టెంపుల్ కు బయలుదేరాము. సాయంకాలం ఎనిమిది అయినందున ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకొని మీనాక్షమ్మను దర్శించుకున్నాము. అలాగే సుందరేశ్వర స్వామిని, గణపతిని, కాలభైరవ స్వామి ఇంకా ఉపాలయాలలోని దేవుళ్లను దర్శించుకుని బయటికి వచ్చాము.
అక్కడ నుంచి చెన్నై నగరానికి వెళ్ళి తిరువాన్ మియూర్ బీచూ లోన సముద్ర స్నానం చేసుకున్నాము.
ఇంతటితో మా యాత్ర సంపూర్ణం మళ్లీ ఎవరి స్వస్థలానికి వారు వెళ్ళిపోయాము. మా ప్రయాణ కథ మధురైలో ఆగింది, మేము ఇంటికి చేరాము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment